వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం వంటి పూజలు నిర్వహించారు.


