పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి
● మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన
చిట్యాల : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నిర్మలకు ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్మల తన పెద్ద కుమారుడు కార్తీక్‌ని గతేడాది మేడ్చల్‌లోని జాన్సన్ అకాడమీలో చేర్పించింది. కార్తీక్ స్కూల్ ఆవరణలోని హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న కార్తీక్ తరగతులకు హాజరుకాకపోవడంతో నిర్మలకు పాఠశాల ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి చెప్పింది. నిర్మల అదే రోజు పాఠశాలకు వెళ్లగా.. కార్తీక్ కన్పించకుండా పోయాడని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడని నిర్మల ఉపాధ్యాయులను నిలదీయగా.. క్రమశిక్షణతో లేని కారణంగా కార్తీక్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు దండించే ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో కార్తీక్ పాఠశాల గేటు దూకి పారిపోయాడని వివరించారు. దీంతో నిర్మల మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే తన కుమారుడు కార్తీక్‌ను పాఠశాలలోని వంట గదిలో ఉపాధ్యాయులు దండించినట్లు పలువురు విద్యార్థులు తనకు చెప్పారని నిర్మల పేర్కొంది.


