ధాన్యం లారీలతో రైతుల ఆందోళన
రామన్నపేట: ధాన్యం కొనుగోలు చేసి 11 రోజులు గడుస్తున్నా.. మిల్లర్లు దిగుమతి చేసుకోకపోవడంతో ఇస్కిళ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు మంగళవారం రామన్నపేటలోని సుభాష్ సెంటర్‌లో ధాన్యం లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 1600బస్తాల ధాన్యాన్ని ఈ నెల 10న పీఏసీఎస్ వారు తూకం వేసి లారీల్లో లోడ్ చేసి ఇంద్రపాలనగరం శివారులోని రైస్ మిల్లుకు పంపారని, అయినా రెండురోజుల వరకు ధాన్యం దిగుమతి చేసుకోలేదన్నారు. క్వింటాకు 15 కిలోలు తగ్గించి దిగుమతి చేసుకుంటామని మిల్లు యజమాని చెప్పడంతో పీఏసీఎస్ అధికారులను ఆశ్రయించగా మరోమిల్లుకు లారీలను పంపించారని పేర్కొన్నారు. అక్కడా దిగుమతి చేసుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు చెప్పారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఎస్‌ఐ నాగరాజు అధికారులతో మాట్లాడి ధాన్యం వెంటనే దిగుమతి అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దీంతో లారీలను ఆయా మిల్లుల వద్దకు పంపించారు.


