సోలార్ విద్యుత్‌తో అనేక ప్రయోజనాలు
చౌటుప్పల్ : సోలార్ విద్యుత్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ రీజినల్ అధికారి వెంకన్న తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమలో ఏర్పాటు చేసిన 680 కేవీ సోలార్ పవర్ ప్లాంట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని, విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. పారిశ్రామికవేత్తలు తమ కంపెనీల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో దివీస్ పరిశ్రమ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.సురేష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు బి.శ్రీనివాస్‌రావు, రాఘవేంద్ర, దివీస్ పరిశ్రమ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


