సాయుధ పోరాట యోధురాలు మృతి
నూతనకల్ : సీపీఎం సీనియర్ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తొట్ల మల్లమ్మ(95) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. సాయుధ పోరాట దళ కమాండర్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొట్ల మల్సూర్‌కు మల్లమ్మ సహచరి. భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు వెంకటనర్సింహారెడ్డితో కలిసి తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో, ఎర్రపహాడ్ గడిపై దాడిలో ఆమె పాత్ర కీలకం. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాటను అల్లిన బండి యాదగిరి మల్సూర్‌కు సహచరుడు. పార్టీ సిద్ధాంతం కోసం, పేదల పక్షాన తుదిశ్వాస వరకు పోరాడారు. ఆమె మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆమె మృతదేహాన్ని సీపీఎం, గౌడ సంఘం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. మల్లమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కమ్యూనిస్టు నాయకులు కోరారు.
అటవీ శాఖకు గుడ్లగూబ పిల్లల అప్పగింత
నకిరేకల్ : మండలంలోని చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల శుక్రవారం గుడ్లగూబ పక్షి పిల్లలు అస్వస్తతకు గురై పడిపోయాయి. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గుడ్లగూబ పిల్లలు పడి ఉన్న విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం కనుకుంట్ల నవీన్‌రెడ్డికి తెలిపారు. దాంతో ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని రెండు గుడ్లగూబలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకవెళ్లి చికిత్స చేయించిన తరువాత అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని ఆయన తెలిపారు.
సాయుధ పోరాట యోధురాలు మృతి


