
పీఏసీఎస్ వద్ద రైతుల ఆందోళన
కేతేపల్లి: కేతపల్లిలోని పీఏసీఎస్ కేంద్రానికి సోమవారం 440 బస్తాల(19.98 మెట్రిక్ టన్నులు) యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఉదయమే పీఏసీఎస్ కేంద్రానికి చేరుకుని టోకెన్ల కోసం చెప్పులు, బండరాళ్లు, ఆధార్ కార్డులను లైన్‌లో ఉంచారు. ఎక్కువ మంది రైతులు రావడంతో పీఏసీఎస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఏఓ పురుషోత్తం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులను వరుసలో నిలబెట్టి టోకెన్ల ప్రకారం ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున 220 మంది రైతులకు యూరియా పంపిణీ చేశారు. లైన్‌లో చివరి రైతులకు యూరియా అందకపోవడంతో పలువురు రైతులు నిరాశగా వెనుదిరిగారు. ఒకట్రెండు రోజుల్లో మళ్లీ యూరియా వస్తుందని ఏఓ తెలిపారు.