
అంతర్జాతీయ స్థాయి పోటీలకు కేంద్రంగా భువనగిరి
భువనగిరి: అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు భువనగిరి కేంద్రంగా మారడం సంతోషించదగ్గ విషయమని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ స్కూల్‌లో జిల్లా టెన్నిస్ అసోసియేషన్, న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజా నర్సింహారావు స్మారక ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం అండర్–18 విభాగంలో బాలబాలికలకు నిర్వహించిన పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న భువనగిరి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్నిస్ స్టేడియాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. వివిధ దేశాల క్రీడాకారులు భువనగిరి జిల్లా కేంద్రానికి వచ్చి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనడంతో భువనగిరి పేరు ప్రపంచ స్థాయికి వెళ్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో క్రీడా రంగానికి, క్రీడాకారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఇలాంటి ఈవెంట్లలో పాల్గొని గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దిడ్డి బాలాజీ, కార్యదర్శి కలీం అహ్మద్, సంయుక్త కార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి