
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
దేవరకొండ : కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన చేయూత పింఛన్‌దారుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెంచకుండా మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకున్నా.. ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. వికలాంగుల పింఛన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలతోపాటు చేయూత పింఛన్లన్నీ రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన చేయూత పింఛన్‌దారుల మహాగర్జనకు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. వీహెచ్‌పీఎస్ నాయకుడు సైదులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో గోవింద నరేష్, ఇరిగి శ్రీశైలం, మారుపాక గోపాల్, నల్ల శ్రీకాంత్, కాశీం, రామదాసు వెంకటాచారి, రామేశ్వరి, కిషన్‌లాల్ పాల్గొన్నారు.
ఫ మంద కృష్ణమాదిగ