
బత్తాయి ధర పతనం
దళారుల సిండికేట్
గుర్రంపోడు : బత్తాయి ధర భారీగా పడిపోయింది. ప్రస్తుతం చేతికొచ్చిన సీజన్ కాయలు తోటల వద్ద టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించి ధర పలకడం లేదు. ఎండాకాలంలో దిగుబడి వచ్చే కత్తెర సీజన్ పంటకు ఈ యేడు వారం రోజులు పాటు టన్నుకు రూ.40 వేల ధర పలికి ఆ తర్వాత రూ.20 వేల పడిపోయి ఈ ధర నిలకడగా నిలిచింది. కత్తెర సీజన్‌లో గతంలో ధర టన్ను రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేది. కత్తెర పంటకు మంచి ధర లభించి.. సీజన్ దిగుబడులు లేకున్నా రైతుకు ఊరట లభించేది. కానీ గత రెండేళ్లుగా కత్తెర, సీజన్ రెండు పంటలకూ మార్కెట్‌లో సరైన ధర లభించక రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదు.
నష్టపోతున్నామని రైతుల ఆవేదన
పదేళ్ల క్రితం బత్తాయి తోటలకు నల్లగొండ జిల్లా పేరుగాంచింది. అప్పట్లో నాలుగు లక్షల ఎకరాలోరైతులు బత్తాయి సాగు చేశారు. కాలక్రమేణా తోటలు తీసేసి.. వరి, ఇతర పంటల సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 40 వేల ఎకరాలకు బత్తాయి సాగు పడిపోయింది. దిగుబడి తగ్గినా బత్తాయికి రేటు మాత్రం పెరగడం లేదు. బత్తాయి ధర పెరుగుతుందేమోనని ఎదురుచూస్తున్న రైతాంగ కాయలు పండు పండి రాలిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ధర పెరుగుతుందనే ఆశలు వదులుకున్న రైతులు ఎదో ఒక ధరకు కాయలు అమ్ముకుంటున్నారు. బత్తాయికి పలురకాల మంగు నల్లి ఆశించడం, కాయలు పక్వానికి రాకముందే రాలిపోవడం లాంటి తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
మార్కెట్‌ను ముంచిన భారీ వర్షాలు
బత్తాయి ధరలు ఇంతగా పడిపోవడానికి ఢిల్లీ, బనారస్, లక్నో, జైపూర్ తదితర ప్రాంతాల్లో రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణమని అంటున్నారు. మార్కెట్లలో సరుకు దిగుమతి చేసుకునే పరిస్ధితి లేక రోజుల తరబడి లారీలు నిలబడి ఉండటం వల్ల మార్కెట్ మందగించి ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఆయా మార్కెట్లలో గతంలో రోజుకు 20 లారీల వరకు విక్రయాలు జరగగా.. ఇప్పుడు ఐదు లారీలకు మించి సరుకు అమ్ముడుపోవడం లేదని అంటున్నారు. ఇక.. అనంతపురం జిల్లాలో గతంలో కంటే ఈ యేడాది అనూహ్యంగా బత్తాయి దిగుబడులు పెరగడం కూడా ధరలు పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. గతంలో నల్లగొండ జిల్లా నుంచే ఎక్కువ ఎగుమతులు ఉండగా ఇక్కడ తోటల విసీర్ణం తగ్గి దిగుబడులు కూడా తగ్గినా అనంతపురం దిగుబడులు మార్కెట్‌ను భర్తీ చేయడం వల్ల డిమాండ్ తగ్గిందని అంటున్నారు.
ఫ క్వింటాకు రూ.15 వేలు మించని రేటు
ఫ దిగుబడులు తగ్గినా పెరగని ధర
ఫ భారీ వర్షాలు కారణమంటున్న
వ్యాపారులు
ఫ తోటల్లో రాలుతున్న కాయలు
ఫ వచ్చిన రేటుకు
అమ్ముకుంటున్న రైతులు
బత్తాయి మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లుగా వ్యవహరించే దళారులు సిండికేట్‌గా మారి ధర పెరగకుండా నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌కు సరకు తగ్గినప్పుడు ధరను పెంచి సరుకు పెరిగాక ధరను తగ్గించడం.. వ్యాపారులకు మాత్రం మంచి ధర ఇచ్చి రైతులకు తక్కువ ధర ఇవ్వడం లాంటి జిమ్మిక్కులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నిబంధనల మేరకు కేవలం నాలుగు శాతం కమీషన్ తీసుకోవాల్సి ఉండగా పదిశాతం కమీషన్ తీసుకోవడం, చూట్ కింద టన్నుకు క్వింటా తరుగు తీస్తున్నారు. అసలే ధర లేక.. మళ్లీ ఈ కోతలు.. పాట పాడింది ఒక రేటు కాగా చేతికి వచ్చేది మరో రేటుతో ఇవన్నీ బత్తాయి రైతును వేధిస్తున్నాయి. మార్కెట్ మోసాలకు భయపడి రైతులు ఏదో ఒక ధరకు ఇక్కడి దళారులకు అమ్ముకుంటున్నారు.

బత్తాయి ధర పతనం