
డీఈఈ సెట్–25 స్పాట్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్
నల్లగొండ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు 2025–27 బ్యాచ్‌లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నల్లగొండలోని ప్రభుత్వ డైట్ కాలేజీలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.గిరిజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
మూసీకి
కొనసాగుతున్న వరద
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్‌కు 6,191 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి 5,060 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 141 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 642.50 అడుగుల(3.84 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది.
పుస్తక పఠనంతో
మేధా శక్తి పెంపు
మిర్యాలగూడ : పుస్తక పఠనం మేధాశక్తిని పెంపొందించడంతోపాటు చారిత్రక విషయాలను తెలియజేస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముక్తేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో తడకమళ్ల రామచందర్‌రావు అధ్యక్షతన ‘ప్రణయ సౌరభం చారిత్రక వైభవం’ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. గ్రంథ రచయిత ముడుంబై పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పుస్తకం, ఒక గ్రంథం రాయడం అనేది సామాన్య విషయం కాదన్నారు. ఎంతో నిబద్ధత, రాయాలని కోరిక బలంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. నేటి యువత ప్రతి విషయాన్ని సోషల్ మీడియా, గూగుల్‌పై ఆధారపడుతోందన్నారు. ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలను అందించి విద్యార్థులకు గత వైభవాన్ని తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తడకమళ్ల రామచంద్రరావు, సంఘనభట్ల నర్సయ్య, సోమ అంజిరెడ్డి, గంజి సత్యనారాయణ, సూలూరు శివసుబ్రహ్మణ్యం, కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి, రామావతారం, పులి కృష్ణమూర్తి, లక్ష్మీనారాయణశర్మ, పయ్యావుల శ్రీనివాస్ రావు, సూదిని వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరాటేలో అక్కాతమ్ముడికి పతకాలు
పెద్దవూర: మండలంలోని చలకుర్తి గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు కరాటేలో అంతర్జాతీయ పతకాలు సాధించి ఔరా అనిపించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండో–నేపాల్ అంతర్జాతీయ కరాటే చాంపియన్ షిప్‌లో చలకుర్తికి చెందిన పాతనబోయిన విహాస్ కటా విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. అలాగే పాతనబోయిన సుదీక్ష రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అక్కాతమ్ముళ్లు సుదీక్ష, విహాస్‌లకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

డీఈఈ సెట్–25 స్పాట్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్

డీఈఈ సెట్–25 స్పాట్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్