ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు!

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి జిల్లాలో తమదైన ముద్రవేసిన కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణల ఆధారంగా జిల్లాకు మరో పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ములుగులో ఆదివాసి గిరిజనురాలైన అయిన సీతక్కకు క్యాబినెట్‌లో అవకాశం కల్పిస్తే, లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా చాన్స్‌ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా సీనియర్లే
నాగార్జునసాగర్‌లో, అంతకుముందు 2009లో రద్దయిన చలకుర్తి నియోజకవర్గం నుంచి మొత్తంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి ఈసారి పోటీ చేయలేదు. ఆయన గతంలో హోంశాఖ మంత్రిగానే కాకుండా 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు కుందూరు జయవీర్‌రెడ్డి అవకాశం ఇచ్చారు.

సూర్యాపేట నుంచి ప్రస్తుతం పోటీ చేసి ఓడిపోయిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గతంలో తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు హుజూర్‌నగర్‌లో మూడుసార్లు, కోదాడలో రెండుసార్లు మొత్తంగా ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు హూజూర్‌నగర్‌నుంచి ఆరోసారి గెలుపొందారు. ఇక నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు ఐదోసారి నల్లగొండ నుంచే గొలుపొందారు.

వీరంతా ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పట్టు కోల్పోకుండా కాడాడటంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు నలుగురైదుగురు ఉండగా, అందులో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలమాద ఉత్తమ్‌మార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఐటీ శాఖ మంత్రిగా సేవలందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా నుంచి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయన్న నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి.

రెండోసారి గెలుపొందిన ముగ్గురు
ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, దేవరకొండ నుంచి బాలూనాయక్‌ కూడా రెండోసారి విజయం సాధించారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో జూనియర్‌లే.

ఉమ్మడి జిల్లాలో పార్టీ నడిపిన నేతలు
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. అయితే, గత పదేళ్లుగా జిల్లాలో పార్టీ ఉనికికి ప్రమాదం రాకుండా సీనియర్‌ నేతలు కీలకంగా వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కోల్పోయినా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండు పార్లమెంట్‌ స్థానాలను దక్కించుకొని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. సీనియర్‌ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top