చౌటుప్పల్: పట్టణ కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వివరాలు.. చౌటుప్పల్ మండలం గుండ్లబావికి చెందిన చిదుగుళ్ల శోభ, తన చిన్న కుమార్తె సింధుతో కలిసి పీపల్‌పహాడ్‌లోని తన పెద్ద కుమార్తె మాదగోని శ్రీజ ఇంటికి ఆదివారం వెళ్లారు. సోమవారం అందరూ గుండ్లబావికి బయల్దేరారు. మార్గమధ్యలో చౌటుప్పల్ బస్టాండ్ సమీపంలో ఆటోను ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో శోభ, ఆమె కుమార్తెలు, ఆటో డ్రైవర్ ఎర్ర గాలయ్య గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేందర్ తెలిపారు.