బరిలో హేమాహేమీలు | Sakshi
Sakshi News home page

బరిలో హేమాహేమీలు

Published Sun, Nov 12 2023 1:12 AM

- - Sakshi

సాక్షి ప్రతినిది, నల్లగొండ: ఎన్నికల బరిలో హేమాహేమీలు తలపడబోతున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగనుంది. 14వ తేదీ నుంచి ప్రచారం ఊపందుకోనుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున సీఎం పర్యటనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇక కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకుల ప్రచార కార్యక్రమాలను దీపావళి తరువాత పెద్ద ఎత్తున నిర్వహించేలా ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. వాటితోపాటు ఇతర పార్టీల ప్రచారంతో వచ్చే 15 రోజులు జిల్లా హోరెత్తనుంది. అన్ని పార్టీల్లోని సీనియర్‌ నేతలు, మంత్రి, మాజీ మంత్రులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న వారంతా ఒకటి కంటే ఎక్కువసార్లు బరిలో నిలిచిన వారే. ఇక కాంగ్రెస్‌లో నలుగురు మినహా మిగితా వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారే తలపడుతుండటం గమనార్హం.

ఎక్కువ నియోజకవర్గాల్లో గట్టి పోటీనే..

మెజారిటీ నియోజకవర్గాల్లో ఈసారి గట్టి పోటీనే ఉండనుంది. ఇప్పటికే జిల్లాలోని ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటారనేది దాదాపుగా తేలిపోయింది. ఎక్కువ స్థానాల్లో ద్విముఖ పోటీ, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉండనుంది. కొందరికి పార్టీ బలమైతే, మరికొందరికి పార్టీతోపాటు వ్యక్తిగత బలం గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యాపేటలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. హుజూర్‌నగర్‌లో మాజీ మంత్రి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సైదిరెడ్డి పోటీలో నిలిచారు. నల్ల గొండలో కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నాగార్జునసాగర్‌లో ఈసారి మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఆయన తనయుడు జయవీర్‌ నామినేషన్‌ వేశారు. జయవీర్‌ మాత్రమే పోటీలో ఉండే అవకాశం ఉంది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వరుసగా బీఆర్‌ఎస్‌ నుంచే రెండుసార్లు విజయం సాధించిన వారు కాగా.. నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్‌ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారే పోటీపడబోతున్నారు. ఇందులో కొందరు కొత్త అభ్యర్థులతోనూ పోటీ పడనున్నారు.

11 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో సీపీఎం

ఈ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు తలపడబోతున్నారు. ఒక్క కోదాడ మినహా మిగిలిన 11 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా, కోదాడలో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తోంది. సీపీఎం.. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఈసారి 7 స్థానాల్లో పోటీలో ఉండేందుకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ, మునుగోడు, మిర్యాలగూడ, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, కోదాడ, భువనగిరి స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తోంది. వాటితోపాటు ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, బీఎస్పీ తదితర పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు.

రానున్న అగ్రనాయకులు

గత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలో ఉండటంతో కొన్ని వర్గాల్లో కొంత వ్యతిరేక భావన వచ్చినట్లు, మరికొన్ని వర్గాల్లో కాంగ్రెస్‌ పట్ల సానుకూలత ఏర్పడినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగే ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా రెండు పార్టీల అభ్యర్థులు తలపడబోతున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రెండు నెలల కిందటే ప్రచారం మొదలు పెట్టగా, సీఎం కేసీఆర్‌ రెండు విడతలుగా ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. 14న మళ్లీ రాబోతున్నారు. దీపావళి తర్వాత కాంగ్రెస్‌పార్టీ కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కర్ణాటక ముఖ్య నేతలు ప్రచార సభలకు హాజరు కానున్నారు. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసింది.

పోటీలో సీనియర్‌ నేతలు, మంత్రి, మాజీ మంత్రులు

ఫ హోరాహోరీగా సాగనున్న ఎన్నికల పోరు

ఫ 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు

ఫ కోదాడ మినహా 11 స్థానాల్లో బీజేపీ పోటీ

ఫ ఏడు స్థానాల్లో సీపీఎం పోటీ

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement