ఉప్పునుంతల: పేద, మధ్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందించే లక్ష్యంతోనే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని రాయిచేడ్ గ్రామ శివారులోని నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఆయన పరిశీలించారు. సంబంధిత ఇంజినీర్లతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ స్కూల్ అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు ఉన్న ప్రమాణాలతో విద్యను అందించడానికి అవకాశం ఉంటుందన్నారు.


