రాష్ట్రస్థాయి రైతు మేళాకు 2,500 మంది | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రైతు మేళాకు 2,500 మంది

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

కందనూలు: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం హకీంపేట గ్రామంలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి రైతు మేళాకు జిల్లా నుంచి 2,500 మంది రైతులు హాజరవుతారని, వీరి కోసం ప్రత్యేకంగా 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. ఒక్కో బస్సులో 50 మంది రైతులు ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించామని, రైతుల ప్రయాణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడంతోపాటు మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి బస్సుకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నోడల్‌ అధికారిగా నియమించినట్లు చెప్పారు. సదరు అధికారి రైతుల హాజరు, ప్రయాణ ఏర్పాట్లు, రైతు మేళా సందర్శన, తిరుగు ప్రయాణం తదితర అంశాలను పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా ప్రతి బస్సుకు ఒక పోలీసు అధికారిని భద్రతా బాధ్యతల కోసం నియమించడంతో పాటు, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఒక్కో బస్సుకు ఒక మహిళా సంఘం సభ్యురాలిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతుల ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి తిరిగి స్వగ్రామాలకు చేరుకునే వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టామన్నారు. రైతులు దూరప్రాంతాల నుంచి రైతు మేళాకు ప్రయాణించనున్న నేపథ్యంలో వారి సౌకర్యాలకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకు ప్రయాణ సమయంలో అల్పాహారం, రైతు మేళా సందర్శన సందర్భంగా మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో రాత్రి భోజనం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, కలెక్టరేట్‌లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాలు అందించే కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రయాణ సమయంలో బాలింతలు తమ శిశువులకు ఇబ్బంది లేకుండా తల్లిపాలు అందించేందుకు ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సురేంద్ర, డీఆర్‌ఓ పాండు, ఆర్టీసీ డీఎం యాదగిరి, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సుప్రియ, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement