రెండో విడతకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

రెండో విడతకు సన్నద్ధం

Nov 6 2026 1:56 AM | Updated on Nov 6 2026 1:56 AM

శిక్షణ కొనసాగుతుంది..

ఎన్యూమరేటర్లుగా అందరికీ అవకాశం..

పక్కాగా శిక్షణ కార్యక్రమాలు..

● 800 మంది జనాభాకు

ఒక ఎన్యూమరేషన్‌ బ్లాక్‌

● ఒక్కో మండలం ఒక్కో చార్జ్‌గా గుర్తింపు

● జిల్లాలో 24 చార్జ్‌లుగా విభజించే

అవకాశం

జనవరి 25 నుంచి జనగణనకు యంత్రాంగం ఏర్పాట్లు

అచ్చంపేట: జనగణన (సెన్సెస్‌) రెండో విడతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇళ్ల గణన(హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌) పూర్తిచేసిన అధికారులు.. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జనాభా లెక్కలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంటింటికి తిరిగి జనాభాను లెక్కించే ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందుగా జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే (సెల్ప్‌ ఎన్యూమరేషన్‌) అవకాశం కల్పిస్తున్నారు. మొదటి విడత హౌస్‌ లిస్టింగ్‌ మాదిరిగానే జనగణన కోసం ప్రతి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేషన్‌ బ్లాక్‌ను గుర్తించనున్నారు. ఇళ్ల గణన చేసినప్పుడు వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ బ్లాక్‌లను గుర్తిస్తున్నారు.

బ్లాక్‌లుగా గుర్తించేందుకు..

జనగణన చేసే ఎన్యూమరేటర్లకు పని ఒత్తిడి లేకుండా బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బాధ్యతలను చార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు అప్పగించి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ శాఖకు చెందిన ఆర్‌ఐలు, డీటీలు, సీనియర్‌ అసిస్టెంట్లు చార్జ్‌ క్లర్కులుగా వ్యవహరించనున్నారు. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, ఆ స్థాయి అధికారులు పనిచేస్తారు. వీరికి టెక్నికల్‌ అసిస్టెంట్ల సహాయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి బ్లాక్‌లను గుర్తిస్తున్నారు.

ఒక్కో చార్జ్‌లో 2వేలకు పైగా బ్లాక్‌లు..

జిల్లావ్యాప్తంగా 24 చార్జ్‌లుగా ఉండనున్నాయి. జనగణన ప్రక్రియలో ఒక్కో మండలాన్ని ఒక్కో రూరల్‌ చార్జ్‌గా పిలవనున్నారు. మున్సిపాలిటీలను అర్బన్‌ చార్జ్‌గా పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో 20 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. ఈ మేరకు చార్జ్‌లుగా విభజించే అవకాశముంది. ఈ చార్జ్‌ల్లో 2వేలకు పైగా బ్లాక్‌లుగా ఉండనున్నాయి. హౌస్‌ లిస్టింగ్‌ సమయంలో అధికారులు ఈ మేరకే బ్లాక్‌లను గుర్తించి మొదటి విడతలో ఇళ్ల లెక్కింపు చేపట్టారు.

జనగణన ప్రక్రియకు సంబంధించి మండల, మున్సిపల్‌ చార్జ్‌ స్థాయి అధికారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు సెన్సెక్స్‌ నిర్వహిస్తాం. 800 మందికి ఒక బ్లాక్‌గా గుర్తించి సెన్సెస్‌ చేపడతాం. జనాభాను లెక్కించే కంటే ముందు జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకోవచ్చు.

– జనార్దన్‌రెడ్డి, ఆర్డీఓ, కల్వకుర్తి

జనగణన ప్రక్రియలో ఎన్యూమరేటర్లుగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారిని వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సెన్సస్‌ నిబంధనలు–1990కి కేంద్ర ప్రభుత్వం కీలక సమవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ నెల 16న విడుదలైంది. తాజా నిబందనలను సెన్సస్‌ (సవరణ) నిబంధనలు–2026గా వ్యవహరించనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం జనగణన విధుల్లో ఎన్యూమరేటర్లుగా ప్రభుత్వ, స్థానిక సంస్థలతో పాటు ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేటు విద్యా సంస్థలు, సొసైటీలు, ట్రస్టులకు చెందిన ఉపాధ్యాయులతో పాటు చట్టబద్ధమైన సంస్థలు, బ్యాంకులు, కంపెనీలు, ఇతర సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల్లో పనిచేసే సిబ్బంది ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకునే అవకాశం కల్పించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు గాను పక్కాగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలతో అధికారులను కీలకం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో పాటు మండల అధికారులకు సైతం జనగణన ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement