రైతుల తరలింపునకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల తరలింపునకు ఏర్పాట్లు చేయాలి

Nov 5 2026 1:10 AM | Updated on Nov 5 2026 1:10 AM

కందనూలు: కొడంగల్‌ నియోజకవర్గంలోని హకీంపేటలో ఈ నెల 9న రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న రైతు మేళాకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రైతులను తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్రమోహన్‌ నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా నుంచి రైతులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని.. రైతులు సకాలంలో మేళాకు చేరుకునేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేళాకు హాజరయ్యే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా రైతుల తరలింపునకు ప్రణాళిక రూపొందించడంతో పాటు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను సమన్వయ బాధ్యతతో నియమించాలని సూచించారు. రైతు మేళాకు వెళ్లే బస్సుల వివరాలు, బయలుదేరే సమయాలు, పికప్‌ పాయింట్లు, ప్రయాణించే రైతుల సంఖ్య తదితర వివరాలను సంబంధిత యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు కార్యక్రమ వివరాలను తెలియజేసి.. పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లైజనింగ్‌ అధికారులు సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, బస్సులు బయలుదేరినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక కంట్రోల్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి, రైతుల ప్రయాణం సజావుగా సాగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, డీఏఓ యశ్వంత్‌రావు, ఆర్టీసీ డీఎం యాదగిరి, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, ఎల్‌డీఎం చంద్రశేఖర్‌, హార్టికల్చర్‌ అధికారి వెంకటేశం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement