కందనూలు: ప్రభుత్వ పరిపాలనలో డిజిటల్ విధానాలను అమలు చేయడంతో పాటు ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగుల సేవా సంబంధిత వ్యవహారాలు, ప్రభుత్వ పనులకు సంబంధించిన అకౌంట్ల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎఫ్‌ఎంఐఎస్ వ్యవస్థపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ట్రెజరీ అధికారి ఎంఏ రషీద్ సూచించారు. రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాల మేరకు ఈ–సాంక్షన్, ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్, వర్క్స్ అకౌంట్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విధానాల అమలులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో పరిపాలనా ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి, ప్రతి దశలో పారదర్శకతను పెంపొందించడమే ఐఎఫ్‌ఎంఐఎస్ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ వ్యవస్థలను అధికారులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ–సాంక్షన్ విధానం ద్వారా ప్రభుత్వ నిధుల మంజూరు, సంబంధిత అనుమతుల ప్రక్రియలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు వీలుంటుందని వివరించారు. ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన వివరాలు, సేవా రికార్డుల నిర్వహణ వంటి అంశాలను డిజిటల్ విధానంలో చేపట్టవచ్చన్నారు. శిక్షణలో భాగంగా ఆయా సాఫ్ట్‌వేర్ల వినియోగం, ఆన్‌లైన్‌లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రక్రియ, డీడీఓలు నిర్వహించాల్సిన బాధ్యతలు, సంబంధిత వివరాల నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై అధికారులకు అవగాహన కల్పించారు.


