కల్వకుర్తి రూరల్: పట్టణంలోని స్టేడియంలో ఈ నెల 3న సబ్ జూనియర్ బాలుర కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, యాదయ్యగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2010 డిసెంబర్ తర్వాత జన్మించి, 60 కిలోలలోపు బరువు ఉన్న క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు పదో తరగతి మెమో, జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99516 29694, 63030 91551 నంబర్లను సంప్రదించాలని వారు తెలిపారు.
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి.. అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయం వద్ద ప్రదక్షిణ అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో జాతర మైదానం కిటకిటలాడింది. మైసమ్మ జాతరకు వెళ్లి వచ్చే వాహనాలతో పెద్దకొత్తపల్లిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. స్థానిక పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.
లేబర్ కోడ్‌లతో అన్యాయం
పెద్దకొత్తపల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లతో కార్మికులు అన్యాయానికి గురవుతున్నారని.. కార్మిక వ్యతిరేక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ీసీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయన్నారు. జీవో నం. 12ను రద్దు చేసి, వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే 55 ఏళ్లు పైబడిన కార్మికులకు రూ. 6వేల పింఛన్, పిల్లల చదువుకు స్కాలర్‌షిప్ అందించాలన్నారు. లేబర్ కార్డు ఉన్న కార్మికుడు ఏ రాష్ట్రంలో మరణించినా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దశరథం, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సహాయ కార్యదర్శి ప్రవీణ్, యాదగిరి, రాముడు, బాలరాజు, నారాయణ, కుర్మయ్య ఉన్నారు.
‘స్ఫూర్తి మాణిక్యాలు’
పుస్తకావిష్కరణ
కొల్లాపూర్: పాన్‌గల్ మండలం చింతకుంటకు చెందిన న్యాయవాది సూగూరు కిషన్‌రావు రచించిన స్ఫూర్తి మాణిక్యాలు పుస్తకాన్ని ఆదివారం కొల్లాపూర్‌లో కవి, రచయితల సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి, దైవభక్తితో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవసరమైన నీతి సూక్తులు ఈ పుస్తకంలో ఉన్నాయని వివరించారు. ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, యువతీ యువకులు చదవాలని వారు సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు వేదార్థం మధుసూదన్ శర్మ, తెలుగు భారతి సంస్థ అధ్యక్షుడు ఆమని కృష్ణ, భూజల భాస్కర్‌రెడ్డి, గూడేలి శ్రీను, రాఘవేంద్ర, మహిమూద్ పాల్గొన్నారు.


