నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య వ్యాపారులకు సూచించారు. నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. తెలంగాణ బీపీటీ కిలో రూ.66, సోనా రూ.74, శ్రీరామ్ గోల్డ్ రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, చిల్లర వర్తకులు ఈ ధరలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తనిఖీల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని న్యాయమైన ధరలకు అందించేందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన
నాగర్‌కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరింది. ఆదివారం ప్రధాన రహదారిపై వాహనాలను శుభ్రం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం సేవలందించే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పట్టకపోవడం బాధాకరమన్నారు.78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పందించి చర్చలకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, హైమావతి, శ్రీనివాసులు, డా.సంధ్య, డా.రామకృష్ణ పాల్గొన్నారు.


