తాడూరు/తెలకపల్లి: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలని డీఈఓ రమేశ్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం తాడూరు మండల కేంద్రం, తెలకపల్లి మండలం రాకొండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినుల హాజరు, పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, ఆహారం నాణ్యతను పరిశీలించారు. అలాగే విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థినులను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు, దుస్తులు షూ, ఇతర సామగ్రి అందరికీ అందేలా చూడటంతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. డీఈఓ వెంట విద్యాశాఖ అధికారి నర్సింహులు ఉన్నారు.


