ఈ పథకంతో విద్యార్థులకు ప్రయోజనాలెన్నో..!
అచ్చంపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. పాఠశాల స్థాయిలో ప్రాథమిక దశలో విద్యార్థులను పరీక్షించి 21 రకాల వైకల్యాలను గుర్తించి అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక దివ్యాంగుల స్క్రీనింగ్ టూల్‌ను కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ టూల్ యాప్‌లో పది వీడియోలను అందులో నిక్షిప్తం చేశారు. ఈ వీడియోల అనుగుణంగా వారిని గుర్తించాల్సి ఉంటుంది. ప్రాథమిక పరిశీలనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థి ప్రవర్తన, కదలికలు, చదవడం, రాయడంలో పడుతున్న ఇబ్బందులను గుర్తించి యాప్‌లో ఉన్న చెక్ లిస్ట్ ఆధారంగా నమోదు చేయాల్సి ఉంది. యాప్ ద్వారా నిర్ధిష్టమైన దృష్టి లోపం, నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రత్యేకంగా విద్యా నిపుణులకు ఐఈఆర్పీలు (స్పెషల్ ఎడ్యుకేటర్స్) వైద్యాధికారులకు పంపించడం జరుగుతుంది. ఇలా పంపించిన పాఠశాలల వివరాలను ప్రశస్త్ యాప్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేటర్స్, వైద్య బృందం పాఠశాలను సందర్శించి ఎవరికై తే ఎలాంటి సమస్యలున్నాయని ప్రశస్త్ యాప్‌లో పొందుపరిచారో వారి వివరాల ఆధారంగా విద్యార్థిని పూర్తిగా పరిశీలిస్తారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే ఉచితంగా కళ్లద్దాలు అందజేసి ఆ విద్యార్థులకు ప్రత్యేక బోధనా పద్ధతులను ప్రారంభించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లాలో 1,29,240 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు 20 వేల మంది విద్యార్థుల స్క్రీనింగ్ మాత్రమే పూర్తయింది. ప్రైవేట్ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో మందకొడిగా సాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మొత్తం
విద్యార్థులు 81,350
భవిత సెంటర్లు
5
సీడబ్ల్యూఎస్‌ఎన్
విద్యార్థులు 2,300
21 రకాల దివ్యాంగుల స్క్రీనింగ్ టూల్
నూతనంగా ఎన్సీఈఆర్టీ ద్వారా అమలు
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో
వెనకబడిన కార్యక్రమం
వీడియోలతో టీచర్లకు అవగాహన
కల్పిస్తున్న అధికారులు


