నాగర్‌కర్నూల్: చట్టాలపై విద్యార్థులతోపాటు ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని స్పెషల్ సెషన్స్ ఫర్ పోక్సో కోర్టు న్యాయమూర్తి నసీం సుల్తానా అన్నారు. జిల్లాకేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సురక్షిత్ బచ్చన్ అభియాన్ పథకం ముఖ్య ఉద్దేశం అని, దేశంలో పిల్లల రక్షణ, వారి హక్కులు, భద్రతను పెంపొందించడమే అన్నారు. చిన్నపిల్లలపై లైంగిక దాడులు, వేధింపులను అడ్డుకోవడం కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టంపై పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు గుడ్ టచ్– బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. బాలల రక్షణకు సంబంధించిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ జిల్లా సెక్రెటరీ నిహారిక, న్యాయవాది శ్రీరామ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.
పట్టు మెళకువలపై రైతులకు అవగాహన
బల్మూర్: నూతనంగా పట్టుపరిశ్రమ చేపట్టిన రైతుల కోసం స్థానిక రైతువేదిక భవనంలో శనివారం జిల్లాలో పట్టు పరిశ్రమను విస్తరించేందుకు సీఎస్ బీ–ఆర్‌ఎస్ ఆర్‌ఎస్, ములుగు బృందం అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా మల్బరీ తోటల నిర్వహణ, పట్టు పురుగుల పెంపకంలో పాటించాల్సిన మెళకువలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంపై తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పట్టుపరిశ్రమపై ఎల్‌నినో ప్రభావం, దానిని ఎదుర్కొనే మార్గాలు, వేరుకుళ్లు తెగులు నివారణ పద్ధతులు వివరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. శాస్త్రవేత్త భువన మాట్లాడుతూ సంప్రదాయ పంటల నుంచి పట్టుపరిశ్రమకు మారే రైతులు నేల సారాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ ప్రాధాన్యతను ఆమె వివరించారు. ఏడీఏ చంద్రశేఖర్ నీటి సంరక్షణ నిర్మాణాలు, వాటి ఏర్పాటుకు అందించే రాయితీలపై వివరించగా, డాక్టర్ రాఘవేందర్ పట్టుపరిశ్రమ ప్రభుత్వ పథకాలు, రాయితీలను తెలియజేశారు. పట్టుపరిశ్రమ, వ్యవసాయ శాఖల అధికారులు జనార్దన్, మల్లేశం పాల్గొన్నారు.
జూరాల కాల్వలకు
నీటి విడుదల
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన కుడి, ఎడమ కాల్వలతో పాటు సమాంతర కాల్వకు శనివారం నీటిని విడుదల చేసినట్లు ఏఈ సుదర్శన్ తెలిపారు. ఆయకట్టుకు వారాబందీ విధానంలో ప్రాజెక్టు అధికారులు సాగునీటిని వదులుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం నుంచి 4 రోజుల పాటు నిరంతరాయంగా కాల్వలకు నీటిని వదలనున్నట్లు వెల్లడించారు. ప్రధాన ఎడమకాల్వకు 1,140 క్యూసెక్కులు, కుడి కాల్వకు 730, సమాంతర కాల్వకు 1,100, భీమా ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు.. మొత్తంగా 3,033 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు మాత్రమే సాగునీటిని వదలాలని.. సమాంతర కాల్వకు కేవలం వరద వచ్చినప్పుడే వదలాలని అమరచింత, ఆత్మకూర్ మండలాల ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నిల్వనీటిని దిగువకు తీసుకెళ్లే కుట్రలు మానుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు.


