నాగర్‌కర్నూల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా క్లెయింలు, అభ్యంతరాల స్వీకరణ గడువును నవంబర్ 26 వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. శనివారం ఓటరు జాబితా సవరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించడంతోపాటు అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం అన్నారు. బీఎల్‌ఓలు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన ధ్రువీకరణ చేపడుతున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితాలను పరిశీలించి, లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు నిబంధనలకు విరుద్ధంగా నమోదు కాకుండా చూడాలన్నారు.
● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 చివరి తేదీ అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 29,890 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారని, మరో 1,335 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హమైన దరఖాస్తులకు ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, ఆయా పార్టీల ప్రతినిధులు హబీబ్, నాగేందర్‌గౌడ్, విష్ణుసాగర్, ఎండీ హుస్సేన్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


