ఉపాధి పనులను వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులను వినియోగించుకోండి

Nov 1 2026 7:19 AM | Updated on Nov 1 2026 7:19 AM

లింగాల: వలసలు వెళ్లకుండా వీబీజీ రాంజీ పథకంలో చేపడుతున్న ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రా అన్నారు. శనివారం మండలంలోని చెన్నంపల్లి, ఎర్రపెంట, శ్రీరంగాపూర్‌, అప్పాయపల్లి గ్రామాలను సందర్శించిన సబ్‌ కలెక్టర్‌ చెంచులను కలిసి అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన చెంచులు ఇటీవల వలసలు వెళ్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చెంచుల వలసలను నిరోధించడానికి సబ్‌ కలెక్టర్‌ ఆయా గ్రామాలను సందర్శించి చెంచులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వీబీజీ రాంజీ పథకం ద్వారా ఉపాధి పనులు అమలు చేస్తున్నామని, వారంలో చేసిన పనులకు మరుసటి వారం కూలీ డబ్బులు వస్తాయని అవగాహన కల్పించారు. అంతే కాకుండా అర్హులైన చెంచులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, అర్హులను గుర్తించి పింఛన్లకు దరఖాస్తు చేసుకునేలా పంచాయతీ కార్యదర్శులు కృషిచేయాలన్నారు. చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గుంపు మేసీ్త్రలు చెంచులను వలసలకు తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం చెంచులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వలస వెళ్లకుండా స్థానికంగా జీవనోపాధి పొందాలని సూచించారు. ఇదిలా ఉండగా ఉపాధి పనులు చేస్తే సకాలంలో కూలీ డబ్బులు రావడం లేదని, దీంతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు చెంచులు వాపోయారు. ఇక నుంచి కూలీ డబ్బులు చెల్లించడంలో ఎలాంటి జాప్యం జరగదని ఆమె చెంచులకు భరోసా ఇచ్చారు. ఆమె వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement