నాకర్‌కర్నూల్/తాడూరు: ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పటేల్ జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం 500పైగా సంస్థానాలను దేశంలో విలీనం చేసి జాతికి ఒకే సార్వభౌమాధికారాన్ని ప్రసాదించి అఖండ భారతాన్ని నిర్మించిన మహా నాయకుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. ఆయన చూపిన ధైర్యం, రాజనీతిజ్ఞత, పరిపాలన దూర దృష్టే ప్రతి భారతీయుడికి మార్గదర్శకాలు కావాలన్నారు. దేశ సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తించే పోలీసు వ్యవస్థకు పటేల్ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్, ఏఓ కృష్టయ్య, ఆర్‌ఐ జగన్, ఆర్‌ఎస్‌ఐలు ప్రశాంత్, గౌస్‌పాషా, శివాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ జిల్లా కార్యాలయంలో, స్థానిక ప్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు.


