అయ్యవారిపల్లి భూ వ్యవహారంలో..
ఉప్పునుంతల: మండలంలోని అయ్యవారిపల్లిలో అక్రమ భూ బదలాయింపులో తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారుల భూ మాయాజాలంపై గత నెల 14న ‘సాక్షి’లో ‘ఇదెక్కడి న్యాయం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేసి ఎట్టకేలకు అక్రమ భూ రిజిస్ట్రేషన్, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పునుంతల తహసీల్దార్ అద్దంకి సునీతను సస్పెండ్ చేస్తూ శనివారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను వెంటనే విధుల నుంచి తప్పిస్తూ.. నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా పనిచేస్తున్న మల్లెల స్వప్నను ఉప్పునుంతల తహసీల్దార్‌గా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆమె ఉప్పునుంతల తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయ్యవారిపల్లి శివారులో దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే సర్వే నం.115లోని 13.17 ఎకరాల భూమిని సంబంధం లేని వ్యక్తులపై భూ అక్రమ బదలాయింపులో తహసీల్దార్ పాత్రపై ఆరోపణలు రావడంతో విచారణ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రాను ఆదేశించారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ సదరు భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. విచారణలో అక్రమం జరిగినట్లు తేలడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఈ భూ అక్రమ బదలాయింపులో అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తే మరికొంత మంది అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది.


