అచ్చంపేట: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ.. రాబోయే రోజుల్లో సాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అధికారులకు సూచించారు. పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్‌లో శుక్రవారం సాగునీటి పారుదలశాఖ అధికారులతో సాగునీటి నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా వర్షపాతం, నీటి లభ్యతలో తలెత్తే మార్పులను దృష్టిలో ఉంచుకొని సాగునీటి వనరుల పరిస్థితి, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు, నీటి వినియోగం, సాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, రైతులకు సాగునీటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అచ్చంపేట నియోజకవర్గంలో సాగునీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ప్రజల అవసరాలు, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో సాగనీటి పారుదలశాఖ ఈఈ అమర్‌సింగ్, డీఈ బాలస్వామి ఉన్నారు.
ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
తాడూరు: వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు సూచించారు. శుక్రవారం తాడూరు మండలం ఆకునెల్లికుదురులో చేపట్టిన వీబీ–జీ రామ్‌జీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోజు 60 మందికి తగ్గకుండా కూలీల సంఖ్య ఉండాలన్నారు. అలాగే వనమహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలు ఎండకుండా నీరందించాలని తెలిపారు. డీఆర్డీఓ వెంట సర్పంచ్ బాల్‌వెంకటయ్య, ఏపీఓ చంద్ర సిద్ధార్థ, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ పెద్దయ్య ఉన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా యోగా సీనియర్ పురుషులు, మహిళల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌గౌడ్, చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 21, 22– 25, 26– 30, 31– 35, 36– 40, 41– 45 ఏళ్లలోపు విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. క్రీడాకారులు కళాశాల నుంచి వయస్సు నిర్ధారణ పత్రం, మిగతావారు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌తో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం పీడీ అరుణజ్యోతి సెల్ నం.91772 52541ను సంప్రదించాలని సూచించారు.
నేడు జూరాల కాల్వలకు నీటి విడుదల
అమరచింత: జూరాల కాల్వలకు శనివారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ రహిమొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి నవంబర్ 4 వరకు ప్రధాన ఎడమ, కుడి కాల్వలకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా రాకపోవడంతో వానాకాలంలో ఆయకట్టు కింద సాగుచేసిన వరి పంటలకు చివరితడిగా నీటిని అందించేందుకు ప్రభుత్వం ఆదేశించినట్లు వివరించారు. భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులోని నీటిని పొదుపుగా వినియోగిస్తున్నామన్నారు.


