నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 13 మండలాలను కరువు మండలాలుగా గుర్తించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు సమన్వయంతో సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. ఆయా మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం సేకరణతో పాటు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయ, ఉద్యాన, మిషన్ భగీరథ, నీటిపారుదల, భూగర్భజల, డీఆర్డీఓ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఊర్కొండ, వెల్దండ, కల్వకుర్తి, వంగూరు, చారకొండ, అమ్రాబాద్, పదర, అచ్చంపేట, బల్మూరు, లింగాల, పెద్దకొత్తపల్లి, కోడేరు, బిజినేపల్లి మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందన్నారు. ఆయా మండలాల్లో కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వాస్తవానికి అనుగుణంగా శాఖల వారీగా పూర్తిస్థాయి నివేదికలు రూపొందించాలన్నారు. కరువు ప్రభావాన్ని అంచనా వేయడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లోని తాగునీటి బోరుబావులు, చేతిపంపులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, నీటి సరఫరా పైపులైన్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. 15 రోజులకు ఒకసారి విధిగా నీటి సరఫరాపై పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, భూగర్భజల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరించి ప్రతి గ్రామంలో తాగునీటి లభ్యతపై పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు కరువు పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసి.. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ సూచించారు. పంటల పరిస్థితి, సాగునీటి లభ్యత, భూగర్భజలమట్టాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సంబంధిత నివేదికలను సమర్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, ఆర్డీవోలు అర్చన, భన్సీలాల్, డీఏఓ యశ్వంత్‌రావు, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, శ్రీరాములు, సుధాకర్‌సింగ్ తదితరులు ఉన్నారు.


