నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించి.. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల్లో ఉమ్మడి జిల్లాలోని 15 మండలాలను ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఆయా మండలాల్లో రైతులు, ప్రజలు సాగు, తాగునీరు అందించాలని రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు పంటనష్ట పరిహారం అందించడంతో పాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు, కరువు సాయం అందించాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో చెంచులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని.. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించామన్నారు. తమ ప్రభుత్వం సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషిచేస్తే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బేషజాలకు పోయి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. వెంటనే ఉపాధిహామీ పనులను ముమ్మరం చేసి, విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజలకు తాగు, సాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిచో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్లు గంగాధర్, జేపీ చారి, మాజీ చైర్మన్ బాబురావు, నాయకులు షఫీ ఉల్లాఖాన్, కేశవులుగౌడ్, శంకర్‌గౌడ్, కుర్మయ్య, కిషోర్‌గౌడ్, టింకు పాల్గొన్నారు.


