వైద్యసేవలపై ‘సమ్మె’ట | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలపై ‘సమ్మె’ట

Oct 26 2026 2:58 AM | Updated on Oct 26 2026 2:58 AM

టీకాలు వేస్తలేరు.. మా పరిధిలో లేదు.. న్యాయం చేయాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి..

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

● 13 రోజులుగా

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

● పల్లె దవాఖానాలు,

పీహెచ్‌సీల్లో నిలిచిన వైద్యసేవలు

● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారులకు టీకా వేయిద్దామని వస్తే ఇక్కడ ఉన్న ఏఎన్‌ఎంలు మీ ఊరిలోనే వేయించుకోండి అని చెబుతున్నారు. మా ఊరిలో సమ్మె కారణంగా పల్లె దవాఖానాలు మూసి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి. జిల్లా వైద్యాధికారి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. – మంజుల,

వట్టెం గ్రామం, బిజినేపల్లి మండలం

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. గ్రామాల్లోని పల్లె దవాఖానాలు మేం ఎలా తెరిపిస్తాం. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె నా పరిధిలో లేదు. వారి సమస్యల పరిష్కారం అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

– కృష్ణ, డీఎంహెచ్‌ఓ

జిల్లాలో ప్రజలకు సేవలు అందిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించకపోవడం బాధాకరం. ఉద్యోగులతో పని ఎక్కువ చేయిస్తూ.. జీతం మాత్రం పనికి తగినట్లుగా చెల్లించడం లేదు. పెరిగిన ధరలతో మాకు వచ్చే జీతం ఏమాత్రం సరిపోవడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.

– కుమార్‌,

జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. సమానపనికి సమాన వేతనం చెల్లించాలి. కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నాం. ఏళ్లతరబడిగా వేతనాలు పెరగడం లేదు. తమ సమస్యల పరిష్కారం కోసం 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. – బాలకృష్ణ,

జిల్లా అధ్యక్షుడు, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ

కందనూలు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జిల్లావ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు విధులకు దూరంగా ఉండి తమ డిమాండ్ల సాధన కోసం 13 రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. నిరవధిక సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, ప్రజలకు వైద్య అవగాహన కల్పించడం, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వీరు సేవలందిస్తున్నారు. అలాంటి ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆందోళన బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.

480 మంది ఉద్యోగులు..

జిల్లాలో 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 178 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా.. వీటి పరిధిలో 480 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మూడు డిపార్టుమెంట్లు మెడికల్‌ ఎడ్యుకేషన్‌, వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో 78 కేడర్లలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే తమను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ప్రధాన గేటు ముందు ప్రతిరోజు నిరసనలు చేపడుతున్నారు. వీరికి బీఆర్‌ఎస్‌, వాపక్షాల నాయకులు మద్దతు ప్రకటించారు.

తప్పని ఇబ్బందులు..

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెతో పల్లె దవాఖానాలు మూతబడ్డాయి. వైద్య సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో తెరుచుకునే పరిస్థితి లేదు. సాధారణంగా పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందించాలి. సబ్‌ సెంటర్లలోనూ ఏఎన్‌ఎం ద్వారా ఆరోగ్య సేవలు అందుతాయి. పల్లె దవాఖానాల్లో పనిచేసే వైద్యులు, సహాయక సిబ్బంది పూర్తిస్థాయిలో జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందినవారు కావడంతో సమ్మె కారణంగా వారు విధులకు రావడం లేదు. రెగ్యులర్‌ ఏఎన్‌ఎం లేని పల్లె దవాఖానాలకు తాళాలు పడ్డాయి.

● ప్రతి బుధవారం, శనివారం చిన్నారులకు టీకాలు అందించాల్సి ఉండగా సమ్మె కారణంగా టీకాల కార్యక్రమం నిలిచిపోయింది. అలాగే గర్భిణులకు చెకప్‌, సీజనల్‌ వ్యాధుల నిర్మూలన, ఫ్రైడే డ్రైడే, యువిన్‌ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ నిలిచిపోవడంతోపాటు ప్రతి వారం బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ..

జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఎక్కడా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. చిన్నపిల్లలకు టీకాలు, ముసలివారు బీపీ, షుగర్‌, ఇతర వైద్యం కోసం వ్యయప్రయాసాలతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement