జాగ్రత్తలు పాటించాలి..
ముందు కాపు వస్తేనే మేలు..
మామిడి తోటల్లో పనులు ప్రారంభించిన రైతులు
● ముందస్తు పూతల
కోసం కసరత్తు ముమ్మరం
● ఇప్పటికే రెండు, మూడుసార్లు
మందుల పిచికారీ
● రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్లు అందిస్తున్న ఉద్యానశాఖ
● ఎల్‌నినో నేపథ్యంలో
జాగ్రత్తలు
పాటించాలని సూచన
కొల్లాపూర్: మామిడి తోటల సాగు పనులకు రైతులు శ్రీకారం చుట్టారు. ముందస్తు దిగుబడుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకప్పుడు రబీ సీజన్ మధ్యలో మామిడి తోటల్లో సాగు పనులు మొదలయ్యేవి. కానీ, గత కొన్నేళ్లుగా ఖరీఫ్ సీజన్ చివరి నుంచే మామిడి సాగు పనులు చేపడుతున్నారు. ఇవి కొందరు రైతులకు లాభాలు తెచ్చి పెడుతున్నాయి. ముందస్తు పూతలు నిలబడితే రైతులకు కాసుల పంట పండుతోంది. మామిడిలో అధిక దిగుబడులు సాధించేందుకు వివిధ రకాల మందులు వినియోగిస్తున్నారు రైతులు.
జిల్లా పరిధిలో ఇలా..
జిల్లావ్యాప్తంగా 37,343 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతుండగా.. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 26,317 ఎకరాల్లో సాగు జరుగుతోంది. మామిడి పంట ఎకరాకు రెండున్నర మెట్రిక్ టన్నుల నుంచి మూడు మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే మామిడి పూతలు జనవరిలో ప్రారంభమై.. ఏప్రిల్ వరకు కాయలు విక్రయ దశకు చేరుకుంటాయి. ఆ సమయానికి మార్కెట్లో మామిడి ధరలు పూర్తిగా పడిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు ముందస్తుగా చెట్లకు పూతలు పూయించేందుకు వివిధ రకాలు రసాయనాలు వాడుతున్నారు. వాటితోపాటే సాగు పనులు కూడా ముమ్మరం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే మామిడి తోటలు సాగుచేస్తున్న, కౌలు తీసుకున్న రైతులు భూమి దున్నకాలు పూర్తిచేయడంతోపాటు పాదులు తీసి పూతలు రావడానికి అవసరమైన మందులు పిచికారీ చేశారు. నవంబర్ నెల వరకు భూమిని బెట్టగా ఉంచాల్సి ఉండగా, అందుకు భిన్నంగా చెట్లకు నీటిని కట్టి సాగు చేపడుతున్నారు. ముందస్తుగా కాపు కాస్తేనే తమకు ఎంతో కొంత లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.
ఉద్యాన శాఖ సహకారం..
మామిడి రైతులకు ఉద్యాన శాఖ పలు సబ్సిడీలు అందిస్తోంది. తోటల్లో డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకు యూనిట్లు మంజూరు చేస్తున్నారు. మామిడి కాయలపై పురుగులు వాలకుండా, రసాయనాలు పడకుండా ఉండేందుకు 50 శాతం సబ్సిడీపై ఫ్రూట్ కవర్లు అందిస్తున్నారు. ఈ కవర్లు కట్టే మామిడి కాయలకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ఫ్రూట్ కవర్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే మామిడి తోటల్లో షెడ్ల నిర్మాణాలకు కూడా ఉద్యానశాఖ సబ్సిడీ ఇస్తోంది.
ఎన్‌నినో ఎఫెక్ట్ ఎంత మేరకు..
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది నీటి ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉంది. సాగునీరు పుష్కలంగా ఉంటేనే మామిడి కాయలు ఆశించిన స్థాయిలో ఎదుగుతాయి. సరైన మోతాదులో నీళ్లు అందకుంటే కాయలు సరిగా పెరగవు. లేదంటే రాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో భూగర్భ నీటి మట్టాలు పడిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఎల్‌నినో ఎఫెక్ట్ మామిడి దిగుబడులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
కొన్నిచోట్ల చెట్ల తొలగింపు
అధిక దిగుబడుల కోసం మామిడి సాగులో రైతులు విరివిగా రసాయనాలు వినియోగిస్తున్నారు. దీంతో మామిడి చెట్ల జీవితకాలం తగ్గుతోంది. అధిక మోతాదులో రసాయనాలు వినియోగించిన చెట్లు కొంతకాలం తర్వాత పంట దిగుబడి ఇవ్వడం లేదు. ఆ చెట్లు మోడువారుతుండడంతో రైతులు వాటిని తొలగించి ఇతర ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. కొన్నేళ్లుగా కొల్లాపూర్ నియోజకవర్గంలో వందల ఎకరాల్లో మామిడి చెట్లను రైతులు తొలగించారు.
కల్వకోల్ సమీపంలో మామిడి చెట్లకు చేసిన పాదులు
జిల్లాలో మామిడి సాగు వివరాలు ఇలా..
నియోజకవర్గం మామిడి సాగు సాగు విస్తీర్ణం
చేస్తున్న రైతులు ఎకరాలు
కొల్లాపూర్ 13,217 26,317
కల్వకుర్తి 1,349 5,199
నాగర్‌కర్నూల్ 1,047 3,210
అచ్చంపేట 830 2,615
అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు విరివిగా రసాయనాలు వినియోగించడం మానుకోవాలి. మోతాదుకు తగిన స్థాయిలో ఎరువులు వాడితే చాలు. సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాధారణంగా నవంబర్ నెల వరకు తోటలను బెట్టగా ఉంచాలి. కానీ, రైతులు ముందుగానే సాగు పనులు చేపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావం మామిడి సాగుపై పడకుండా ఎలాంటి జాగ్రత్తలో తీసుకోవాలో రైతులకు చెబుతున్నాం. – లక్ష్మణ్,
ఉద్యాన శాఖ అధికారి, కొల్లాపూర్
మామిడి పంటకు ముందు కాపు వస్తేనే రైతులకు లాభం. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు మామిడికి మార్కెట్లో మంచి ధరలు ఉంటాయి. ఆ తర్వాత బాగా తగ్గిపోతాయి. ఆలస్యంగా పంట వస్తే ధరలు కూడా ఉండవు. రూ.లక్షలు పెట్టి తోటలు కౌలుకు తీసుకునే రైతులు ఈ కారణంగానే ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే ముందస్తు కాపు కోసం రైతులు ముందుగానే తోటలను సిద్ధం చేసుకుంటున్నారు.
– బాలచంద్రుడు,
మామిడి రైతు, కొల్లాపూర్


