కందనూలు: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సత్వర వైద్యసేవలు అందించడంతోపాటు వారికి ఆర్థిక భారం లేకుండా మెరుగైన చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం కింద అర్హత కలిగిన ఆస్పత్రుల నమోదును వేగవంతం చేయాలని, ప్రజలకు ఈ పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీసీ నిర్వహించి పీఎం రాహత్ పథకం అమలు, విధివిధానాలను వివరించారు. వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు అత్యవసర వైద్యసహాయం అందించడం అత్యంత ముఖ్యం అన్నారు. ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందేలా వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో పీఎం రాహత్ పథకం కింద వైద్యసేవలు అందించేందుకు 40 ఆస్పత్రులను గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుమతి పొందిన ఆస్పత్రులు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పథకం అమలు విధివిధానాలను ఆస్పత్రుల యాజమాన్యాలకు వివరించి, అవసరమైన ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం రాహత్ పథకం నిబంధనల ప్రకారం అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించే అవకాశం ఉందన్నారు. ఈ పథకం ద్వారా అందించే వైద్యసేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని వివరించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ కృష్ణ, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


