కందనూలు: కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, నాలుగు కార్మిక లేబర్ కోడ్ల రద్దు కోసం హైదరాబాద్‌లో ఆది, సోమవారాల్లో నిర్వహించే మహాధర్నాకు తరలిరావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మహాధర్నా వాల్‌పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా సమస్యల పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రామయ్య, బాలకృష్ణమ్మ, రేణుక, రాధ తదితరులు పాల్గొన్నారు.
యురేనియం తరహాలో సాగునీటి పోరాటం
అమ్రాబాద్: యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటం తరహాలో సాగునీటి కోసం ఉమ్మడి అమ్రాబాద్ మండల ప్రజలు ఉద్యమించాలని నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ కన్వీనర్ నాసరయ్య అన్నారు. శనివారం సాయంత్రం వివిధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా సాగునీటి కోసం ఈ ప్రాంత ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. గతంలో దారవాగు, మానువడ్డవాగు ద్వారా సాగునీరు ఇస్తామని, ఇప్పుడు నక్కలగండి– నార్లాపూర్, ఏదుల రిజార్వాయర్ అంటూ చెబుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నల్లగొండకు నీరందించేందుకు సిద్ధమయ్యారు కానీ.. నది ఒడ్డున ఉన్న మా అప్పర్‌ప్లాట్ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఇందుకోసం ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు బాలకిష్టయ్య, శ్రీను, విజయమోహన్, బాలయ్య, చెన్నకిష్టయ్య, రామస్వామి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
శనేశ్వరుడికి పూజలు
నాగర్‌కర్నూల్: బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామంలో శని త్రయోదశిని పురస్కరించుకొని శనివారం శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ పూజారి గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. గోచార రీత్యా, జన్మ రిత్యా ఉన్న గ్రహ దోష పరిహారం కోసం అభిషేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


