కందనూలు: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి.. ఉద్యోగుల న్యాయ సమ్మతమైన సమస్యలు పరిష్కరించి వారి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కందికొండ గీత అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం వైద్య సిబ్బంది తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని చేస్తున్న సమ్మెకు శనివారం ఆమె మద్దతు ప్రకటించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల మంది ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, వేతనాల పెంపు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కేడర్ ఉద్యోగికి 100 శాతం గ్రాస్ జీతం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జిల్లా జేఏసీ అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


