జిల్లాలో ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు నిరంతర పర్యవేక్షణతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి నిహారిక, అదనపు కలెక్టర్ దేవసహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ కృష్ణ, జిల్లా ప్రైవేట్ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


