ఇందిరమ్మ కుట్టు మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ కుట్టు మిషన్లు

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

వందశాతం సబ్సిడీపై రూ.12 వేల విలువైన ఆటోమేటిక్‌ మిషన్లు

18 నుంచి 55 ఏళ్లలోపు బీసీ మహిళలు అర్హులు

జిల్లాలో ఇప్పటికే

2,492 మంది దరఖాస్తు

ఈ నెల 15 వరకు గడువు

అచ్చంపేట: నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టైలరింగ్‌లో నైపుణ్యం కలిగిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇంటింటా ఇందిరమ్మ పథకం పేరుతో ఉచితంగా ఆటోమేటిక్‌ కుట్టమిషన్ల అందించాలని నిర్ణయించింది. మహిళలకు టైలరింగ్‌ రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించి పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టుమిషన్‌ పథకం ద్వారా మరింత ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్‌ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది.

నియోజకవర్గానికి వెయ్యి..

రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్‌ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వం తొలి విడతగా పైలెట్‌ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు వందశాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. జిల్లాలో నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20 మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే కుట్టు మిషన్‌ తీసుకోవడానికి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో కుట్టు మిషన్‌ విలువ రూ.12 వేల వరకు ఉంటుంది. జిల్లాకు 4 వేల వరకు ఆటోమేటిక్‌ కుట్టుమిషన్లు మహిళలకు అందించనుండడంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. భవిష్యత్‌లో పథకాన్ని విస్తరించి ప్రతీ ఒక్కొరికి అందించేలా రూపకల్పన చేస్తున్నారు.

వారు అనర్హులు..

18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగి ఉండి.. తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలై ఉండాలి. మహిళలు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్ష లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్‌ కార్డుపై ఒకరికి మాత్రమే ఉచిత కుట్టుమిషన్‌ పథకాన్ని వర్తింపజేస్తారు. అర్హులైన వారు http//tgobmms@ogg.gov.in పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, కలెక్టర్‌ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 2023– 24లో బీసీ స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధిపొందిన వారిని అనర్హులుగా పేర్కొన్నారు. పేదలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలతోపాటు మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి సైతం ప్రాధాన్యం ఉంటుంది.

కనీస విద్యార్హత ఉండాలి..

ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్‌ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉండాలి. దరఖాస్తులు ఎక్కువ వస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస విద్యార్హత 5వ తరగతిగా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌ కార్డు, అర్హత పత్రాలను అప్‌లోడ్‌ చేసి.. పత్రాలను ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో అందజేయాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు.

నిబంధనల మేరకే..

అర్హులైన నిరుద్యోగ బీసీ మహిళలు ఈ నెల 15 వరకు కుట్టు మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 2,492 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటాం. గతంలో లబ్ధిపొందిన వారు అనర్హులు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథలు, నిరుద్యోగ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.

– ఇందిర, జిల్లా బీసీ సంక్షేమ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement