నాగర్‌కర్నూల్: ప్రత్యేక ప్రచార రోజులను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని, సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార రోజులను ప్రతిఒక్క ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, కాబట్టి ఫారం–6 ద్వారా నూతన ఓటర్లుగా నమోదు, ఫారం–7, 8కు అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పొందని ఓటర్లు కూడా ఈ ప్రత్యేక ప్రచార రోజుల్లో ఫారం–6తోపాటు డిక్లరేషన్ ఫారాన్ని జత చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని చెప్పారు. ఓటర్లకు అవసరమైన సహాయం అందించేందుకు బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సర్‌లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరయ్యే సమయంలో ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, రీ–హియరింగ్‌కు ఒకసారి మాత్రమే అవకాశం ఉన్నందున, ఓటర్లు తమకు సంబంధించిన అన్ని ఆధారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. 2004 తర్వాత జన్మించిన వారు తమ తల్లిదండ్రులిద్దరికీ సంబంధించిన ధ్రువపత్రాలతోపాటు సంబంధిత ఓటరు ధ్రువపత్రాన్ని, 2004కు ముందు జన్మించిన వారు తమ ధ్రువపత్రాలతోపాటు తల్లి లేదా తండ్రి ఆధారాలను సమర్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది ఓటర్లకు నోటీసులను అందజేశామని, నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నిర్ణీత సమయంలో హియరింగ్‌కు హాజరై, అవసరమైన ధ్రువపత్రాలను అందించి ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్నికల డీటీ కల్పన తదితరులు పాల్గొన్నారు.


