●
ఆశించిన స్థాయిలో లేదు..
ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.
– రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ
విద్యార్థులు ఎంపిక చేసుకుంటేనే..
పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్‌కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్,
డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్‌సెల్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఎప్పుడూ లేనంతగా అడ్మిషన్లు చాలా తక్కువ కావడం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో సీట్లను ప్రభుత్వ, అటానమస్ డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చాలా ప్రైవేట్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు.. ఇప్పుడు సీట్ల భర్తీ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో గతం కంటే చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహిస్తుందా.. లేదా.. అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. యూజీలో మొత్తం 65 కళాశాలలు ఉండగా వీటిలో 28,860 సీట్లు భర్తీకి ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తే 8,561 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఏటా రూ.10 కోట్లు..
యూనివర్సిటీకి పీజీతోపాటు యూజీ విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కళాశాలల్లో సీట్లు పొందితేనే ఆదాయం సమకూరుతుంది. ఉన్న సీట్లలో ప్రతిఏటా తగ్గుదల రావడంతో యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ కళాశాలలు మూతబడుతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అప్లియేషన్, ఇతర పరీక్షలు, సప్లిమెంటరీ ఇలా అనేక రకాల ఫీజులు సమకూరుతాయి. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలు మూతబడితే యూనివర్సిటీకి సమకూరే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో 4 అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఇప్పటికే 3,049 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరినా ఆయా ఫీజులు మొత్తం వాటికి మాత్రమే చెందగా.. యూనివర్సిటీకి అరకొర ఆదాయం వస్తుంది. మొత్తంగా అటానమస్ కళాశాలలు పెరగడం, ప్రైవేటు కళాశాలలు తగ్గడంతో యూనివర్సిటీ ప్రతిఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాలమూరు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం
దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ
షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో పూర్తయిన చేరికలు
ఇప్పటి వరకు సగమైనా పూర్తికాని సీట్ల భర్తీ
పీయూ పరిధిలో మొత్తం 28,860 సీట్లకు 8,561 మాత్రమే..
కళాశాలలు మూతబడితే యూనివర్సిటీ ఆదాయానికి గండి
38 ప్రైవేటు కళాశాలల్లో..
పీయూ పరిధిలో మొత్తం ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలు 38 ఉంటే వాటిలో 13,580 సీట్ల సామర్థ్యంలో వివిధ కోర్సులను యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా వీటిలో కేవలం భర్తీ అయ్యింది 2,394 సీట్లు (17.64 శాతం) మాత్రమే. నాలుగు అటానమస్ కళాశాలలో 5,040 సీట్లు ఉండగా రిపోర్టు చేసిన విద్యార్థులు 3,049 (60.50 శాతం) మంది. వీటితోపాటు 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 10,200 సీట్లు ఉండగా 3,090 మంది (30.29 శాతం) రిపోర్టు చేశారు. ఇలా తక్కువ ఉన్న అటానమస్ కళాశాలల్లో కూడా 3 వేలకు పైగా సీట్లు భర్తీ అయితే.. ఏకంగా 38 కళాశాలలు ఉన్న ప్రైవేటులో మాత్రం తక్కువ సీట్లు కావడంతో చాలా కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


