జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానదీ తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య దూపదీపాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణా తీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్‌తిర్మలాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు.
జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు
కొల్లాపూర్: జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకునీరెత్తినట్లు ఉంటోంది.
ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్..
కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ సమీపంలో కృష్ణానదీ తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజవంశస్థులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం నెల రోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. తర్వాతి కాలంలో ఆలయాన్ని జటప్రోల్‌లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యధాతథంగా సాగాయి. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. కొన్నేళ్లుగా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా.. సరైన ప్రచారం లేకపోవడంతో తగిన గుర్తింపు లభించడం లేదు. జటప్రోల్‌లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు.
దశాబ్దాలుగా నిరాధరణకు గురవుతున్న వైనం
చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం పట్టని యంత్రాంగం
టూరిజం సర్క్యూట్ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి


