అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలకు దారులన్నీ పలుచోట్ల కోతకు గురవడంతో రాకపోకలకు చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావడం కూడా కష్టంగా మారింది. రహదారి సౌకర్యం సరిగ్గా లేదంటూ గతంలో ఓ చెంచు మహిళ మృతదేహాన్ని ఫర్హాబాద్ చౌరస్తా వద్ద వదిలివెళ్లిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. చెంచు పెంటలకు ఏళ్ల తరబడి రోడ్లతో పాటు అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అటవీ, గిరిజన సంక్షేమశాఖల మధ్య సమన్వయ లోపం చెంచులకు శాపంగా మారుతోంది.
ప్రతిపాదనలు బుట్టదాఖలు..
గిరిజన సంక్షేమశాఖ ఏడాదిన్నర క్రితం అమ్రాబాద్, లింగాల మండలాల్లోని చెంచుపెంటలకు మట్టిరోడ్ల నిర్మాణానికి రూ. 2కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అమ్రాబాద్ మండలం మల్లాపూర్‌పెంట, లింగాల మండలంలోని మల్లాపూర్, పుల్లాయిపల్లి, ఆగర్లపెంట, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, సంగిడిగుండాలకు, వ్యూ ఫాయింట్, ఫర్హాబాద్ చౌరస్తా నుంచి రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించారు. నేటికీ అనుమతులు రాకపోవడంతో చెంచులు అద్వానపు రహదారులపై అవస్థల ప్రయాణం కొనసాగిస్తున్నారు.
నిత్యం కష్టాలే..
మన్ననూర్ నుంచి ఈర్లపెంటకు వెళ్లాలంటే 30 కి.మీ. కాలినడక తప్ప మరో మార్గం లేదు. అప్పాపూర్ వరకు మాత్రమే వాహనాలు ఇబ్బందులు పడుతూ వెళ్తాయి. అక్కడి నుంచి ఇతర చెంచు పెంటలకు వెళ్లడానికి ఎలాంటి సౌకర్యం లేదు. అటవీ ప్రాంతంలో కాలినడకే శరణ్యంగా మారడంతో చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెంచుపెంటలకు అద్వానపు దారులు
రోడ్ల నిర్మాణాలకు అటవీశాఖ మోకాలడ్డు
ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం
రాళ్లు, రప్పలపైనే రాకపోకలు సాగిస్తున్న గిరిపుత్రులు
నెరవేరని ప్రభుత్వ లక్ష్యం..
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2004లో పలు రహదారులు నిర్మించేందుకు రూ.కోట్లు మంజూరైనా అటవీశాఖ నిబంధనలతో ముందడుగు పడలేదు. అచ్చంపేట మండలం ఘనపూర్ నుంచి పదర మండలం చిట్లంకుంట వరకు 9 కి.మీ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో రూ. 90లక్షలు మంజూరు కాగా.. గుత్తేదారు 4 కి.మీ. రహదారి నిర్మించి, అటవీ ప్రాంతంలో ఉన్న 5 కి.మీ. అనుమతులు లేవని వదిలేశారు. ఫర్హాబాద్ చౌరస్తా నుంచి అప్పాపూర్‌కు 25 కి.మీ. భూగర్భ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2007లో రూ.1.50 కోట్లు మంజూరు కాగా.. అటవీశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయింది. కొల్లాపూర్ మండలం అమరగిరి వరకు బీటీ రహదారి పనులకు గతేడాది నిధులు మంజూరయ్యాయి. సగం మాత్రమే పనులుచేసి వదిలేశారు.


