పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు భక్తుల తాకిడి తగ్గింది. మృగశిర కార్తె ముగియడంతో ఆదివారం తక్కువ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం తయారుచేశారు. మైసమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణల అనంతరం నైవేద్యం సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 6వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆటోకార్మికులసమస్యలు తీర్చండి
కల్వకుర్తి రూరల్: ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆటోడ్రైవర్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మున్నూరు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యంతో నష్టపోతున్న ఆటోకార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేసి.. ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ. 12వేలు చెల్లించడంతో పాటు పోలీసులు, రవాణాశాఖ అధికారుల వేధింపులు ఆ పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతి పట్టణంలో ఆటోస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో శివశంకర్, పరుశరాములు, సైదులు, రాజేశ్, శివరాములు, అమీర్ పాల్గొన్నారు.
ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడిగా నిరంజన్
కందనూలు: ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడిగా నిరంజన్ యాదవ్ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎన్నికల పరిశీలకుడు సాయికుమార్ ఆధ్వర్యంలో ఖోఖో అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా ఎస్.వెంకటయ్య, లక్ష్మి, కిరణ్‌కుమార్, కృష్ణయ్య, ఆర్థిక కార్యదర్శిగా పురంచంద్, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, కార్యదర్శులుగా రాజు, తులసీరెడ్డి, ఆంజనేయులు, రాధ, యాదయ్య, నీలాబాయి రవికుమార్, రాఘవులుగౌడ్, మోహన్‌లాల్ ఎన్నికై నట్లు ఆయన తెలిపారు.


