పసిబిడ్డ చనిపోయినా పట్టించుకోరా?
● బాధితులపైనే కేసులు పెడతారా..
● కుమ్మెర ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
కందనూలు: కుమ్మెర జాతరలో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిబిడ్డను కోల్పోయిన ఘటన దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు బిడ్డగా చెబుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ ప్రాంతంలోనే ఒక దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతిలో నియోజకవర్గ అధికారులంతా కీలుబొమ్మలుగా మారారని.. ఫలితంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలన విషయంలో పట్టు కోల్పోయారని ఆయన ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేస్తే.. దాడికి పాల్పడిన నిందితుల నుంచి ఫిర్యాదు తీసుకుని బాధితులపైనే కేసులు పెట్టే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే కొనసాగుతున్నాయని.. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, కట్టా సుధాకర్‌రెడ్డి ఉన్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కుమ్మెర ఘటనలో అకారణంగా దాడిచేసి.. రెండు నెలల పసికందు హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా శిబిరంలో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి మాట్లాడారు. కుమ్మెర ఘటనపై పోలీసులు స్పందించిన తీరును చూస్తుంటే.. నిందితులకు వారే పరోక్షంగా సహకరిస్తున్నారనే విషయం అర్థమవుతుందన్నారు. నేటికీ కులవివక్షత కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. నిరుపేద కుటుంబంపై దాడి, పసిబిడ్డ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పసిబిడ్డ చనిపోయినా పట్టించుకోరా?


