పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. ఇటీవల గుంపుమేస్త్రి చెర నుంచి విడిపించిన వలస కూలీలకు బుధవారం జిల్లాకేంద్రంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఇటీవల వనపట్లకు చెందిన గుంపుమేస్త్రి ఎర్రయ్య చెర నుంచి తెలకపల్లి మండలానికి సంబంధించిన వలస కూలీలను గతనెల 23న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో విడిపించడం జరిగిందన్నారు. వలస కూలీలు వెట్టిచాకిరీ నుంచి ఎలా బయటపడాలి.. జీవితంలో ఎలా ఉన్నతంగా జీవించాలనే విషయాలను వివరించారు. పిల్లలను పనిలో పెట్టకూడదని.. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు కలిగి ఉండాలన్నారు. అనంతరం బ్యాంకు ఖాతా ప్రాముఖ్యతను వివరించి.. ఆధార్, బ్యాంకు ఖాతా లేని వారికి నేషనల్ ఆదివాసీ సంస్థ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆధ్వర్యంలో ఎన్‌రోల్‌మెంట్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ లక్ష్మణ్‌రావు, ఎల్‌ఓ రాజ్‌కుమార్, డీసీపీఓ శ్రీశైలం, సీఐ శంకర్ పాల్గొన్నారు.


