‘కల్వకుర్తి రూపురేఖలు మారుస్తాం’
కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, అందుకు తగినట్టుగా పట్టణాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ఇప్పటికే సుమారు రూ.70 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అందరూ కలిసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో నియోజకవర్గానికి నిధులు ఇప్పిస్తామంటే బీజేపీ కౌన్సిలర్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని, రాజకీయ విద్వేషాలకు తావులేకుండా సమన్యాయంగా సమాంతర పాలన అందించాలని చెప్పారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులను చూసి ఖర్చు చేయాలని, ఏదో ఆదరాబాదరాగా అవసరం లేనిచోట ఖర్చు చేస్తే నిధుల దుర్వినియోగం అవుతుందే తప్ప అభివృద్ధి జరగదన్నారు. అంతకు ముందు చైర్‌పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్‌ఖాన్ వారి చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు పలువురు నాయకులు, పట్టణ ప్రజలు చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


