గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం

Feb 28 2026 8:37 AM | Updated on Feb 28 2026 8:37 AM

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కందనూలు: గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన నిర్ణయాల్లో సర్పంచులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. అచ్చంపేట డివిజన్‌లోని 137 జీపీల సర్పంచులకు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 3వ విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు ముందుండి పనిచేయాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా తమ వ్యక్తిగత గౌరవం కూడా పెంపొందుతుందని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా తమ పరిపాలన పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడేలా ఉండాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండరాదన్నారు. మహిళా సర్పంచులు తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. లోటుపాట్లు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పన్నులు, ఇతర స్థానిక వనరుల ద్వారా సమకూరే ఆదాయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. తద్వారా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవ సహాయం, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్‌ నాయక్‌, డీపీఓ శ్రీరాములు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement