సకలకళా సురభిలు | - | Sakshi
Sakshi News home page

సకలకళా సురభిలు

Mar 1 2026 8:23 AM | Updated on Mar 1 2026 8:23 AM

సకలకళ

సకలకళా సురభిలు

స్వాతంత్య్రానికి ముందే కొల్లాపూర్‌లో డబుల్‌ లైన్‌ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు

దక్షిణ భారతంలో రెండో విమానం కొనుగోలు చేసింది వీరే..

ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట

కళలకు పట్టం.. ఉద్యానవనాల సాగుకు బీజం

కొల్లాపూర్‌ బంగ్లా వ్యూ

జటప్రోల్‌, కొల్లాపూర్‌ సంస్థానాలుగా సురభిరాజుల ప్రజారంజక పాలన

రాచరిక పాలన అంటే సంప్రదాయాలు, కట్టుబాట్లు, బానిసత్వం ఉంటాయి.. కానీ, కొల్లాపూర్‌ను శతాబ్దాల పాటు పాలించిన సురభి రాజవంశస్థులు అందుకు భిన్నంగా స్వేచ్ఛాయుత పాలన అందించారు. ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ.. కళలకు పట్టం కట్టి.. అధునాతన వసతులతో ఆదర్శవంతమైన పాలన సాగించారు.. ఆ కాలంలోనే కొల్లాపూర్‌లో వంద ఫీట్ల వెడల్పాటి రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం, ఆస్పత్రి వసతులు కల్పించారంటే వీరి ముందుచూపు ఏపాటిదో ఊహించవచ్చు. అలాగే దక్షిణ భారతంలోనే మద్రాస్‌, నిజాం పాలకుల తర్వాత విమానం కొనుగోలు చేసిన ఘనత వీరికే దక్కింది. ఆధునికతతోపాటు ఆధ్యాత్మికత, తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట వేసిన సురభిరాజ వంశస్తుల ప్రజారంజక పాలనపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ కథనం.. – కొల్లాపూర్‌

సుపరిపాలన అందించిన రాజా వెంకట లక్ష్మారావు

తెలంగాణ రాష్ట్రంలో గల 14 సంస్థానాల్లో సురభిరాజులది ఒకటి. జటప్రోల్‌ను కేంద్రంగా చేసుకుని సాగించిన వీరి పరిపాలనకు సంబంధించిన చారిత్రక అంశాలు 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్నాయి. జటప్రోల్‌లో శత్రుదుర్భేద్యమైన రాజధాని కోట నిర్మించారు. జటప్రోల్‌ సంస్థానంపైకి తరచూ కర్నూలు జిల్లా నుంచి శత్రురాజులు దండయాత్రలు చేస్తుండడంతో 1840లో రాజా లక్ష్మణరాయల కాలంలో సంస్థానాన్ని కొల్లాపూర్‌కు మార్చారు. మైసూరు ప్యాలెస్‌ నమూనాతో రాజమహల్‌, మంత్రమహల్‌, రాణిమహల్‌ అని విభజించి భారీ కోటను నిర్మించారు. 1884లో రాజా వెంకటలక్ష్మణరావు హయాంలో సంస్థానం కోట నిర్మాణం జరిగింది. 1948లో సురభిరాజుల సంస్థానం రాజా వెంకట జగన్నాథరావు పరిపాలనా కాలంలో భారత ప్రభుత్వంలో విలీనమైంది.

కవుల పోషణ

సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్‌ కవి వంటి ఉద్దండులు ఉండేవారు.

తెలుగు భాషా పరిరక్షకులు

నిజాం నవాబులకు సామంతులుగా ఉన్న సురభిరాజులు పరిపాలనలో ఎక్కడ కూడా నిజాం పోకడలను అనుసరించలేదు. ప్రధానంగా భాషా పరిరక్షణలో వారు తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చారు. సంస్థానాల్లో చాలాచోట్ల ఉర్దూ ప్రభావం ఉన్నప్పటికీ.. జటప్రోల్‌, కొల్లాపూర్‌ సంస్థానంలో మాత్రం ఆ ఊసు ఎక్కడా కనిపించదు. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా 1920లో కొల్లాపూర్‌ కవులచే స్నేహలతా కవితా సంఘాన్ని ఏర్పాటు చేయించి.. దాని నిర్వహణకు సహకరించారు. 1930లో రాణి రత్నమాంబ ఆర్థిక సహకారంతో వైజయంతి అనే తెలుగు పత్రికను ప్రచురించారు.

అభివృద్ధికి చిరునామా..

కొల్లాపూర్‌ పట్టణాన్ని సురభిరాజులు అభివృద్ధికి చిరునామాగా మార్చారు. దేశంలో విద్యుత్‌ వాడకం ప్రారంభమైన తొలినాళ్లలోనే మద్రాసు సంస్థానంతోపాటు విద్యుత్‌ వినియోగించిన పట్టణాల్లో కొల్లాపూర్‌ ఒకటి. 18వ శతాబ్దంలోనే ధర్మాస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందించారు. 1920లోనే టౌన్‌ ప్లానింగ్‌ రూపొందించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం వేలాది ఎకరాలకు సాగునీరందించేలా సింగోటం శ్రీవారి సముద్రం చెరువు నిర్మించారు. హిందూ, ముస్లింలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ.. జటప్రోల్‌లో హజ్రత్‌ ఇనాయత్‌షా ఖాద్రీ దర్గా ఉర్సుకు మదనగోపాలస్వామి ఆలయం నుంచి పూజా సామగ్రిని పంపించేవారు.

నిజాంకు ఇష్టమైన ప్రాంతం..

కొల్లాపూర్‌ సంస్థానం నిజాం నవాబుకు ఇష్టమైన ప్రాంతం. సురభి రాజులు సింగోటంలో నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి నిజాం నవాబు రోజూ ఒక్క రూపాయి చొప్పున కై ంకర్యంగా పంపేవారు. 1850 నుంచే నిజాం పాలకులతో సురభి రాజులకు సత్సంబంధాలు ఉండేవి. 1854 నుంచి 1884 వరకు సంస్థానాన్ని పాలించిన రాజా వెంకట జగన్నాథరావును నిజాం పాలకులు రాజా బహదూర్‌, నిజాం నూజ్‌వంత్‌ అనే బిరుదులతో సత్కరించారు.

కళలకు పుట్టినిల్లు..

సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్‌, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్‌, కొల్లాపూర్‌లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్‌లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధాన్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి.

హైదరాబాద్‌లోరాజవంశ వారసులు..

సురభి రాజవంశ వారసుడిగా ప్రస్తుతం ఆదిత్య లక్ష్మారావు కొనసాగుతున్నారు. సింగోటం లక్ష్మీనర్సింహస్వామి, జటప్రోల్‌ మదనగోపాలస్వామి, కొల్లాపూర్‌లోని మాధవస్వామి, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి, శివాలయం, రామాలయాలకు ఫౌండర్‌ ట్రస్టీగా ఉన్నారు. ఆదిత్య లక్ష్మారావుకు అనిరుధ జగన్నాథరావు, విధుర రాజగోపాలరావు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరు సికింద్రాబాద్‌లోని సురభి గార్డెన్‌లో నివాసం ఉంటున్నారు.

ఉద్యానవనాల పెంపకంపై దృష్టి

బొబ్బిలి రాజవంశాలతో బంధుత్వం ఉన్న సురభి రాజులు అక్కడి నుంచి వివిధ రకాల మామిడి మొక్కలను తెచ్చి కొల్లాపూర్‌లో ఉద్యానవనాల సాగుకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మామిడి మొక్కలను కొల్లాపూర్‌లోని పెద్దతోటలో సాగుచేశారు. పెద్దతోటలో కాచిన పండ్లను బ్రిటీష్‌ పాలకులతోపాటు నిజాం నవాబులకు పంపేవారు.

సకలకళా సురభిలు1
1/4

సకలకళా సురభిలు

సకలకళా సురభిలు2
2/4

సకలకళా సురభిలు

సకలకళా సురభిలు3
3/4

సకలకళా సురభిలు

సకలకళా సురభిలు4
4/4

సకలకళా సురభిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement