అందని రైతు ‘భరోసా’
● పంట పెట్టుబడి సాయం కోసంరైతన్నల ఎదురుచూపులు
● యాసంగి సీజన్ వరినాట్లు పూర్తి.. దిగుబడి దశలో వేరుశనగ
● ఎన్నికలు ముగిసినా నిధుల విడుదలపై స్పందించని ప్రభుత్వం
● తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
శాటిలైట్ సర్వే ఆధారంగా..
సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో శాటిలైట్ సర్వే చేసింది. సర్వే నంబర్ల వారీగా రైతుల వివరాలు నమోదు చేస్తూ.. ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సర్వే పూర్తిచేయగా.. సాగుచేసిన భూముల వివరాలను వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో నమోదు చేసినప్పటికీ రైతు భరోసా జాడే లేకుండాపోయింది. కాగా, రైతుభరోసా కింద ఎకరాకు ప్రతి ఏడాది రూ. 15వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రెండు సీజన్‌లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పెట్టుబడి సాయం పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. రెండు సీజన్‌లలో ఎకరాకు రూ. 12వేలు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఒక సీజన్‌లో రూ. 6వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
అచ్చంపేట: యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పంటలు చేతికందే సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు రైతు భరోసా జమ కాలేదు. ఎన్నో ఇబ్బందులు పడి వేరుశనగ, వరి, ఇతర పంటలు సాగుచేసిన రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 2023 యాసంగిలో 3.06 లక్షల మంది రైతులకు రూ. 369.21 కోట్లు అందించగా.. 2024 యాసంగిలో 2.41 లక్షల మంది రైతులకు రూ. 247.39 కోట్ల సాయం మాత్రమే అందింది. అదే ఏడాది వానాకాలంలోనూ రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు.. 5 – 6 ఎకరాలున్నా చిన్న, మధ్యతరహా రైతులు కూడా నష్టపోయారు. ప్రస్తుత యాసంగిలోనూ రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా సాగదీస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో పంటసాగు ఇలా..
జిల్లాలో 7,59,793 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుత యాసంగి సీజన్‌లో 3.95 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఇందులో 1,40,064 ఎకరాల్లో వరి, 1,06,368 ఎకరాల్లో వేరుశనగ, 1,35,348 ఎకరాల్లో మొక్కజొన్న, 10,734 ఎకరాల్లో మినుములు, 811 ఎకరాల్లో జొన్నలు, 674 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేశారు. ఎకరాకు రూ. 6వేల చొప్పున రూ.237 కోట్లు అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా అందించకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.
ఎన్నికల కోడ్ సాకుతో..
గతేడాది డిసెంబర్‌లోనే అందాల్సిన యాసంగి సాయం వరుస ఎన్నికల కారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు వాయిదా పడుతూ వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిధులు విడుదల చేయాలని.. లేకపోతే మళ్లీ కోడ్ సాకుతో సాయం నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రైతుభరోసా
పొందే రైతులు 3.06 లక్షలు
సమగ్ర వివరాలు నమోదు..
సాగులో ఉన్న భూముల వివరాలు రైతుల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరిచాం. ఈ ఏడాది కొత్తగా పంట సాగుచేసిన భూముల వివరాలను సైతం మండల తహసీల్దార్, వ్యవసాయాధికారి నివేదిక ఆధారంగా నమోదు చేశాం. రైతుభరోసాకు సంబంధించిన జాబితా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – యశ్వంత్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి


