లెక్క పక్కా..
వలంటీర్లతో పంటల డిజిటల్ సర్వే
త్వరలోనే పూర్తిచేస్తాం..
ఒక్కో నమోదుకు
రూ.7 చెల్లింపు..
● ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయశాఖ
● జిల్లాలో 330 మంది వలంటీర్లు
అవసరం
● ఎంపిక బాధ్యత ఎంఈఓలకు..
●
అచ్చంపేట: వలంటీర్లతో పంటల డిజిటల్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. అగ్రికల్చర్‌లో డిగ్రీ, డిప్లొమా, సైన్స్ గ్రాడ్యుయేట్ ఇతర డిగ్రీలు ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని.. వారు లేకుంటే ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని వలంటీర్లుగా నియమించాలని ఏఈఓలను ఆదేశించింది. స్థానికులైన వలంటీర్లను నియమించి.. 45 రోజుల్లో పంటల డిజిటల్ సర్వే ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించింది. అయితే రెండేళ్ల క్రితమే ఏఈఓలకు డిజిటల్ సర్వే చేయాలని బాధ్యతలు అప్పగించినప్పటికీ.. వారు ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నందున సక్రమంగా సర్వే నిర్వహింలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సర్వే ప్రైవేటు వలంటీర్లతో చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నెలాఖరులోగా ప్రారంభం..
జిల్లావ్యాప్తంగా 143 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 348 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే భూ భారతి మ్యాప్ కలిగిన 330 గ్రామాల్లో పంటల సర్వేకు వలంటీర్లను నియమించనున్నారు. మిగతా గ్రామాల్లో ఏఈఓలే సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆయా క్లస్టర్ల పరిధిలో ఏఈఓలు వలంటీర్ల నియామక ప్రక్రియ ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో పాటు డిజిటల్ సర్వేపై అవగాహన కలిగిన ఉన్న వారిని వలంటీర్లుగా నియమించి.. ఒకటి, రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రారంభించాలని జిల్లా వ్యవసాయశాఖ యోచిస్తోంది.
3.95లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లావ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో 3.95లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగుచేశారు. అందులో వరి 1.40 లక్షల ఎకరాలు, వేరుశనగ 1.6 లక్షలు, మొక్కజొన్న 1.35లక్షలు, ఇతర పంటలు మరో 14వేల ఎకరాల్లో సాగుచేశారు. వలంటీర్లు పూర్తిస్థాయిలో డిజిటల్ సర్వే నిర్వహించి.. పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
జిల్లావ్యాప్తంగా డిజిటల్ సర్వేకు వలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. వారికి సమగ్ర శిక్షణ అనంతరం త్వరలోనే పంటల సర్వే ప్రారంభిస్తాం.
– యశ్వంత్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఎంపికై న వలంటీర్లు మొబైల్ యాప్ ద్వారా పంటల నమోదు చేపట్టనున్నారు. ఒక్కో డిజిటల్ నమోదుకు ప్రభుత్వం రూ.7 చొప్పున వలంటీర్లకు చెల్లించనుంది. సర్వేలో భాగంగా రైతు డిజిటల్ ఫొటో, భూమి విస్తీర్ణం, ఏ విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేశారు.. రైతు ఫోన్ నంబర్‌ను నమోదు చేయనున్నారు.


