పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
కందనూలు: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించగా.. 5,968 మంది విద్యార్థులకు గాను 5,806 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,588 మందికి గాను 4,475 మంది, ఒకేషనల్ విభాగంలో 1,380 మందికి గాను 1,331 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 113 మంది, ఓకేషనల్ విభాగంలో 49 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ వెంట డీఐఈఓ వెంకటరమణ ఉన్నారు.
పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి


